![]() |
![]() |
బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా తెరకెక్కిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' అంతర్జాతీయ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో విరుచుకుపడిన ఈ సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ అదే స్థాయి సంచలనాన్ని నమోదు చేసింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన మొదటి నాన్-ఇంగ్లీష్ చిత్రంగా 'ధురంధర్' అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ వేదికపై నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో టెడ్ సరాండోస్ స్వయంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో సినీ ప్రియులు పండగ చేసుకుంటున్నారు.
గణాంకాల ప్రకారం.. 2026 జనవరి నుండి జూన్ మధ్య కాలంలోనే ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 37 మిలియన్ల డిజిటల్ వీక్షణలను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా, ఏకకాలంలో ఏకంగా 22 దేశాలలో నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ చార్ట్స్‌లో అగ్రస్థానంలో నిలిచి గ్లోబల్ సంచలనం సృష్టించింది.
ప్రతిభావంతుడైన దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో రెండు భాగాలుగా రూపుదిద్దుకున్న ఈ ఫ్రాంచైజీ, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రన్ ద్వారా ఈ ఫ్రాంచైజీ దాదాపు రూ. 3,100 కోట్లకు పైగా భారీ గ్రాస్ వసూళ్లను సాధించి భారతీయ సినీ రంగాన్ని గర్వపడేలా చేసింది.
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన మొదటి భాగం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించగా, ఈ ఏడాది మార్చిలో వచ్చిన సీక్వెల్ 'ధురంధర్: ది రివెంజ్' సరికొత్త రికార్డులను నెలకొల్పింది. భారతదేశంలో రూ. 1,000 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచి ట్రేడ్ వర్గాలను సైతం మైమరిపించింది.
ఈ అరుదైన మైలురాయితో సోషల్ మీడియా వేదికగా రణ్‌వీర్ సింగ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా భారతీయ కంటెంట్‌కు లభిస్తున్న ఈ విశేష ఆదరణపై సినీ పండితులు, ఇండియన్ మూవీ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ ఓటీటీ వేదికలపై హాలీవుడ్ ప్రాజెక్ట్‌లకు గట్టి పోటీ ఇస్తూ, రాబోయే రోజుల్లో భారతీయ సినిమాలు మరిన్ని గ్లోబల్ రికార్డులను తిరగరాయడం ఖాయమని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
![]() |
![]() |